బాలల హక్కు లు, సంక్షేమం, సంరక్షణే ప్రథమ ప్రాధాన్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన బాలల హక్కుల కమిషన్ ద్వారా చిన్నారులకు ప్రయోజనం కలుగుతున్నదన్న నమ్మకం ఉన్నదన్నారు. బాలల హక్కుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటుచేసిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.
తెలంగాణలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా బాలలు, మహిళలకు ఎలాంటి లోటులేకుండా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లు అమలుచేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే జోగినపల్లి శ్రీనివాస్‌రావు నేతృత్వంలో స్టేట్‌చైల్డ్ రైట్స్ కమిషన్ ఏర్పాటుచేశామన్నారు.
రాష్ట్రంలో చాలామంది బాలలు విధివంచితులుగా ఉన్నారని, చేయని తప్పుకు ఎందరో శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌పై ఉన్నదన్నారు. తోడుగా ఉన్నామన్న నమ్మకం బాలల్లో కల్పించాలని సత్యవతి రాథోడ్ సూచించారు. బాలల చట్టాలను చిత్తశుద్ధితో అమలుచేయగలిగితే రాష్ట్రంలో బాలలకు మంచి భవిష్యత్ అందించగలిగిన వారమవుతామని వివరించారు. చిన్నారుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తున్న యునిసెఫ్‌తో సమన్వయం చేసుకొని బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.