నేడు రాష్ట్ర క్యాబినెట్ భేటీ

రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఆర్టీసీ సమ్మెవల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నది. సంస్థ ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాలపాలవుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే.. ఈ డిమాండ్ అమలు సాధ్యంకాదన్న అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా ఉన్నది. ప్రభుత్వం కూడా ఆర్టీసీ విలీనం అసాధ్యమన్న స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. కోర్టు సైతం ఈ డిమాండ్‌ను పక్కనబెట్టి, ఇతర డిమాండ్లపై చర్చించాలని కార్మికసంఘాలకు సూచించినా.. కార్మికసంఘాలు మాత్రం చర్చల్లో దీనినే ప్రధాన డిమాండ్‌గా తీసుకురావడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. మరోవైపు సమ్మెపై కోర్టులో విచారణ జరుగుతున్నది.


ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి నిర్ణ యం తీసుకోనున్నారని తెలుస్తున్నది. కేంద్రం తీసుకువచ్చిన మోటర్ వాహనాల (సవరణ) చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం లభించే అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని రాష్ట్రంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజారవాణాకు ఇబ్బంది కలుగకుండా పక్కా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు దాదాపు 3, 4 వేల రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇచ్చే అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే వెయ్యి అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇస్తే 21 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి ఉన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తున్నది.