రానున్న నాలుగు సంవత్సరాలలో.. ఎలక్ట్రానిక్ పరిశ్రమద్వారా రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇందుకోసమే.. తెలంగాణకు మూడో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ని మంజూరుచేయాలని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, న్యాయశాఖల మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖ రాశామని చెప్పారు. సోమవారం రాయదుర్గంలో ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇంటెల్ సంస్థ భారతదేశంలో తన రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసింది. మొత్తం మూడు లక్షల చదరపు అడుగులు, ఆరు అంతస్తుల్లో నిర్మించిన సెంటర్‌లో 1500 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. గత ఐదేండ్లలో ప్రపంచ దిగ్గజ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఉబర్, మైక్రాన్, ఇంటెల్, సేల్స్‌ఫోర్స్ తదితర కంపెనీలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేశాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ రంగం ద్వారా 60 వేల ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ రంగంలో చైనాకు చెందిన స్కైవర్త్ కంపెనీ 50 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడను ఏర్పాటుచేయాలని నిర్ణయించిందన్నారు.
ఎలక్ట్రానిక్ పరిశ్రమద్వారా 3 లక్షల ఉద్యోగాలు