గీతదాటితే లైసెన్సుపై వేటు

 వాహనదారుల నిర్లక్ష్యంపై రవాణాశాఖ కొరడా ఝళిపిస్తున్నది. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై, ట్రాఫిక్‌, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నది. తొలుత జరిమానాలతో సరిపెడుతూనే, పదేపదే నిబంధనలను ఉల్లంఘించేవారి డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దుచేస్తున్నది. 2015 నుంచి ఇప్పటివరకు 21,194 లైసెన్సులపై వేటుపడింది. త్వరలో మరో ఆరు వేల లైసెన్సుల రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. లైసెన్సు సస్పెండ్‌ చేసేందుకు రెండు క్యాటగిరీలుగా విభజించారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన కేసులు మొదటి క్యాటగిరీగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలు చోటుచేసుకున్న వాటిని రెండో క్యాటగిరీగా వర్గీకరించి కేసులు నమోదుచేస్తున్నారు. వీటితోపాటు రోడ్డు ప్రమాదాల నివారణపై సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సులను కూడా రద్దు చేస్తున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.